కలం, నాగర్కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు (NHM Employees) చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం వద్ద ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ”ఇంకెన్నాళ్లీ ఆత్మఘోష.. మా కష్టాలు, కన్నీళ్లు చాలు మహాప్రభో.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి” అంటూ విజ్ఞప్తి చేశారు. నాడు ప్రాణాలకు తెగించి సేవలు అందించి, నేడు ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రపంచమంతా భయాందోళనలకు గురవుతున్నా ఎన్హెచ్ఎం ఉద్యోగులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వైరస్ బారినపడిన వారికి చికిత్స అందించడంలో, బాధితులకు అండగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు.
కరోనా పరీక్షలు, టీకాల కార్యక్రమాలు, ఆరోగ్య పర్యవేక్షణలో నిరంతరం శ్రమించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు ఎండనకా, వాననకా విధులు నిర్వర్తించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణలో బాధ్యతాయుతంగా పనిచేశారు. మారుమూల గ్రామాల్లోని పేదలకు సైతం వైద్య సేవలు చేరువ చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచారు. అర్ధరాత్రి వేళల్లోనూ అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటూ ఎన్నో కుటుంబాలకు వైద్య భరోసా కల్పించారు. ప్రజారోగ్య పరిరక్షణే బాధ్యతగా భావించి, తమ వ్యక్తిగత అవసరాలను పక్కనపెట్టి విధులు నిర్వర్తించారు. ఇంతటి సేవలందించిన తమకు నేడు ఉద్యోగ భద్రత లేకపోవడం, పిల్లల చదువులు, కుటుంబ పోషణపై ఆందోళన చెందాల్సి రావడం బాధాకరమని వాపోతున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించిన తమ కుటుంబాల భవిష్యత్తుకు మాత్రం భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
ఎన్హెచ్ఎం పరిధిలోని 78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తమ సేవలను గుర్తించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని తీవ్రవేదన వ్యక్తం చేస్తున్నారు . కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌస్ పాషా, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు భీముడు, ప్రకాష్, హైమావతి, వనజ, లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

