కలెక్టరేట్ ఎదుట జేబీపీ నిరసన.. ఆళ్ళ మురళి అరెస్టుకు డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించిన కేసులో ముద్దాయిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఆళ్ళ మురళి (Alla Murali)ని వెంటనే అరెస్ట్ చేయాలని  జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం (Kothagudem) కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ​

ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ.. కొత్తగూడెం పట్టణ 3వ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో A1 ముద్దాయిగా ఆళ్ళ మురళి ఉన్నారని తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించగా.. మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న మురళి మిల్లింగ్ చేసి తిరిగి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. కానీ, అలా చేయకుండా రెండు సంవత్సరాల ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సుమారు రూ. 6 కోట్ల 91 లక్షల విలువైన ధాన్యాన్ని అమ్ముకున్నారని, అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

​గతంలో 2021, 2022 సంవత్సరాల్లోనూ ఇదే విధంగా ధాన్యాన్ని మళ్లించిన మురళి.. మూడు నెలల క్రితం రూ. 2 కోట్లు చెల్లించాడని గుర్తుచేశారు. రైతుల వద్ద నుండి మిల్లర్లు ధాన్యం సేకరించిన తర్వాత రెవెన్యూ అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉండగా, లక్షల రూపాయల మామూళ్ల మత్తుకు అలవాటు పడిన అధికారులు రెండేళ్లుగా జరుగుతున్న ఈ భారీ బాగోతాన్ని చూసిచూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు.

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ధాన్యం దారి మళ్లించిన ఆళ్ళ మురళిని, సహకరించిన రెవెన్యూ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఆళ్ళ మురళిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో జేబీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, శంకర్, రాంబాబు, కవిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>