కలం డెస్క్ : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు ఆ దేశంతో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అనేక రకాల ఉత్పత్తులపై టారిఫ్ విధించడంతో ఆ దేశంలోని వినియోగదారులపై భారం పడుతున్నది. ఇతర దేశాల అజమాయిషీని తగ్గించి స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించేలా ఈ నిర్ణయాలు ఉన్నాయనే వాదన ఎలా ఉన్నా గ్లోబల్ ఎకానమీ వ్యవస్థలో చిన్న నిర్ణయం సైతం పెను ప్రభావాన్ని చూపుతున్నది.
ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలు అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలనే ప్రశ్నార్ధకం చేశాయి. టారిఫ్ పేరుతో దిగుమతి సుంకాలను పెంచేయడంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్టీల్, ఫర్నీచర్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, అల్యూమినియం, ఫార్మా తదితర రంగాలపై ప్రభావం పడింది. సొంత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, దెబ్బతిన్నదాన్ని పునర్ నిర్మించాలనే లక్ష్యం గురించి ట్రంప్ ఎంతగా చెప్పుకున్నా చాలా దేశాలకు ఈ నిర్ణయాలు గుదిబండగా మారాయి. ఎకానమీ వృద్ధి రేటు అంచనాలు కూడా తలకిందులవుతున్నాయి. దేశాల మధ్య కొత్త వాణిజ్య సంబంధాలకు ఆస్కారం ఏర్పడింది.
పరిశ్రమలకు ప్రోత్సాహం :
సొంత దేశానికి చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, ఉత్పత్తి యూనిట్లను స్థాపించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో కొత్త ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని, ఇతర దేశాల నుంచి వలసలను అరికట్టవచ్చన్న లాజిక్ ను కూడా ట్రంప్ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. ఇతర దేశాలపై ఆధారపడే తత్వాన్ని రూపుమాపవచ్చని, వలసలతో సొంత పౌరులకు చేజారిపోతున్న ఉద్యోగాలను కల్పించవచ్చన్నది వారి వాదన. తాజా టారిఫ్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 600 బిలియన్ డాలర్ల మేర అదనపు వనరులు సమకూరే అవకాశం ఉన్నది.
టారిఫ్ నిర్ణయాలతో ఒక్కసారిగా అమెరికాలోని దిగుమతి వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడంతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తిపై భారం పెరిగింది. ఫలితంగా క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. ఆ దేశ పౌరులు ఇతర దేశాల నుంచి వస్తున్న వస్తువులను కొనడం తగ్గించేశారు. ద్రవ్యోల్బణం పెరిగిందని జేపీ మోర్గాన్ లాంటి ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. ఇక సాఫ్ట్ వేర్ సహా పలు అమెరికా కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో పాటు కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపేసుకున్నాయి. దీనికి తోడు వలసలను తగ్గించేందుకు హెచ్1-బి వీసాపైనా రకరకాల ఆంక్షలు విధించడంతో అమెరికా ఖజానాకు నిధులు సమకూరే సంగతి ఎలా ఉన్నా భారత్ లాంటి అనేక దేశాలకు ఊహించని దెబ్బ తగిలినట్లయింది.
వెంటాడుతున్న భయం :
ట్రంప్ ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే గుబులు అనేక దేశాల్లో మొదలైంది. పిచ్చోడి చేతిలో రాయి.. అంటూ ట్రంప్ తీరుపై భారత్ లోని పౌరులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తొలుత టారిఫ్ ల పేరుతో సుంకాన్ని పెంచగా ఆ తర్వాత హెచ్1-బి దరఖాస్తు రుసుమును విధించారు. తాజాగా సినీ పరిశ్రమపైనా విరుచుకుపడ్డారు. హాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% టారిఫ్ విధించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపైన ఇలాంటి సంచలన నిర్ణయాలు ఏమేం వస్తాయో.. అది పలు దేశాల ఆర్థిక వ్యవస్థల మెడకు ఏ రూపంలో చుట్టుకుంటుందోననే చర్చలు చోటుచేసుకున్నాయి.

