కలం డెస్క్ : Jubilee Hills Voters | జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 14 వేల మంది కొత్త ఓటర్లు చేరారు. ఇందులో యువ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. గత ఎన్నికల్లో దాదాపు 16 వేల పైచిలుకు ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాధ్ గెలిచినా ఈసారి విజయం ఏ పార్టీ అభ్యర్థిని వరిస్తుందనేది ఫలితాల తర్వాత తేలనున్నది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని బీఆర్ఎస్, ఈసారి గెలిచేది తమ పార్టీ అభ్యర్థనేనని కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి. దివంగత మాగంటి గోపీనాధ్ మృతితో ఏర్పడిన సెంటిమెంట్, ఆయన భార్యే స్వయంగా పోటీలో ఉంటుండడం, సామాజిక సమీకరణాలు, పార్టీల మధ్య పొత్తు.. ఇలాంటి అంశాలు నిర్ణయాత్మకం కానున్నాయి.
ఎలక్షన్ కమిషన్ సంసిద్ధం :
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సన్నాహాలు షురూ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండినవారితో ఓటర్ల జాబితాను రూపొందించి ఆ తర్వాత కొత్తగా చేరిన ఓటర్లతో తుది జాబితాను సెప్టెంబరు 30న ప్రకటించింది. ఆ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గ ఓటర్లతో పోలిస్తే ఈసారి దాదాపు 14 వేల మంది పెరిగారు. దీనికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య (407) కూడా పెరిగింది. మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువ ఉన్నారు. అర్బన్ నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో పోలింగ్ 47.58 శాతమే నమోదైంది. ఉప ఎన్నిక కావడంతో ఓటర్లు ఆసక్తితో పాల్గొంటారా?.. లేక లైట్ తీసుకుంటారా అనేది పోలింగ్ అనంతరం స్పష్టమవుతుంది.
లెక్కల్లో జూబ్లీహిల్స్ : (2025 సెప్టెంబరు 30న)
మొత్తం ఓటర్లు : 3,99,000
పురుషులు : 2,07,382
మహిళలు : 1,91,593
ఇతరులు : 25
ఫస్ట్ టైమ్ ఓటర్లు : 6,106
80 ఏండ్లు పైబడినవారు : 2,613
గత ఎన్నికల్లో…
మొత్తం ఓటర్లు : 3,85,287
పోలైన ఓట్లు : 1,83,337
పోలింగ్ శాతం : 47.58%
నోటా ఓట్లు :1,374
చెల్లుబాటైన ఓట్లు : 1,81,938
అభ్యర్థులు : 19 మంది
పోలింగ్ కేంద్రాలు : 352
విజేత : మాగంటి గోపీనాధ్ (బీఆర్ఎస్) – 80,549 ఓట్లు (44.27%)
ప్రత్యర్థి : అజారుద్దీన్ (కాంగ్రెస్) – 64,212 ఓట్లు (35.29%)
మార్జిన్ : 16,337 ఓట్లు (8.9%)

