కలం, వెబ్ డెస్క్: వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మాదురోను (Nicolas Maduro) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్బంధించిన విషయం తెలిసిందే. అనంతరం దేశాధ్యక్షుడు నికోలస్ మాదురో గురించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నికోలస్ మాదురో పుట్టపర్తి సత్యసాయిబాబాకు భక్తుడు. అంతేకాక వామపక్ష దేశాలతో సన్నిహితంగా ఉన్నాడు. డ్రైవర్ నుంచి కార్మిక సంఘ నాయకుడిగా, అక్కడి నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగారు. ఇలా మాదురో జీవితంలో అనేక అంశాలు ఆసక్తికరం. చివరకు ట్రంప్‌తో పెట్టుకున్న వైరం.. ఆయనకు పెను గండంగా మారింది. వెనిజులా అధ్యక్షుడిగాఆయన పాలనలో అనేక వివాదాస్పద అంశాలపై పార్టీల్లోనేకాక ప్రజల్లో చర్చలు సాధారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశ సైన్యం వెనిజులాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మాదురోను, అతని భార్యను అదుపులోకి తీసుకున్నది.
12 ఏండ్ల పాలన అంతం
12 ఏండ్ల మాదురో పాలన వెనుజులాలో ముగింది. మాదురోను అమెరికా సాయుధ దళాలు తమ అదుపులోకి తీసుకున్నాయని ట్రంప్ స్వయంగా పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన మాదురో, దేశాధ్యక్ష పదవిని అందుకోవడం గమనార్హం. కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలతో ఆయన సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. అమెరికా సహా పాశ్చాత్య దేశాలతో తీవ్ర శత్రుత్వాన్ని కొనసాగించారు. అదే శత్రుత్వం చివరికి అతని అధికారానికి చెక్ పెట్టింది.
బాబా అనుచరుడిగా మాదురో
నికోలస్ మాదురో 1962 నవంబర్ 23న వెనిజువేలా రాజధాని కారాకాస్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి నికోలస్ మాదురో గార్సియా ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు. 1989లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. తల్లి టెరిసా డి జీసస్ మోరోస్ గృహిణి. మాదురోకు మారియా టెరిసా, జోసెఫినా, అనిటా అనే ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ప్రారంభంలో రోమన్ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబానికి చెందిన మాదురో, అనంతరం భారతీయ ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా ప్రభావంతో ఆయన అనుచరుడిగా మారారు. మాదురోకు ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉందని చెబుతారు. మాదురో రెండు సార్లు వివాహం చేసుకున్నారు.
ఆయన తొలి భార్య అడ్రియానా గెరా అంగులో. ఆమెతో ఆయనకు నికోలస్ మాదురో గెరా అనే కుమారుడు ఉన్నాడు. 1994లో వీరిద్దరు విడిపోయారు. అనంతరం ఆయన సిలియా ఫ్లోరెస్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె జాతీయ అసెంబ్లీ మాజీ అధ్యక్షురాలు, గృహనిర్మాణ శాఖ మాజీ మంత్రి, అలాగే హ్యూగో చావెజ్‌కు న్యాయవాదిగా కూడా పనిచేశారు. సిలియా ఫ్లోరెస్‌కు ఆమె తొలి వివాహం ద్వారా జన్మించిన వాల్టర్ జాకబ్, యోస్వాల్, యోసెర్ గవిడియా అనే ముగ్గురు కుమారులను మాదురో తన సవతి కుమారులుగా స్వీకరించారు.
బస్ డ్రైవర్ నుంచి అధ్యక్షుడి వరకు ప్రయాణం
1970లలో కారాకాస్ మెట్రోలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ మాదురో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన అనధికారిక ట్రేడ్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. 1980లలో క్యూబాకు వెళ్లిన మాదురో, అక్కడ వామపక్ష రాజకీయ సిద్ధాంతాలపై శిక్షణ పొందినట్టు సమాచారం. తర్వాత వెనిజులా నేత హ్యూగో ఛావెజ్‌కు దగ్గరయ్యారు. 1998లో ఛావెజ్ ఎన్నికల విజయానికి మాదురో కీలకంగా పనిచేశారు. ఆ తరువాత వెనిజులా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 1998 నుంచి జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగారు.
2005–2006 మధ్య జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2006 నుంచి 2013 వరకు వెనిజులా విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన మాదురో, 2012–2013లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో హ్యూగో ఛావెజ్ మరణంతో మాదురోను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు అధికారికంగా 50.61% ఓట్లు వచ్చినట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
మానవ హక్కుల ఉల్లంఘనలు, వివాదాస్పద ఎన్నికలు
2018, 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ మాదురో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే ఈ రెండు ఎన్నికలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా విమర్శించాయి. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున ఎడ్మండో గోన్సాలెజ్ విజయం సాధించినట్లు విపక్షాలు ప్రకటించాయి. కానీ వెనిజులా సుప్రీంకోర్టు మాత్రం మాదురో విజయాన్నే ధృవీకరించింది. మాదురో పాలనలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. హైపర్ ఇన్‌ఫ్లేషన్ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా పెరిగింది. 70 లక్షల మందికిపైగా దేశ ప్రజలు ఇతర దేశాల్లో శరణార్థులుగా మారారు. మానవ హక్కుల ఉల్లంఘనలు విస్తృతంగా చోటుచేసుకున్నప్పటికీ, మాదురో తన పాలనను నిర్బంధం లేకుండా కొనసాగించారు.
అమెరికాతో శత్రుత్వం కొంపముంచిందా?
2020లో అమెరికా ప్రభుత్వం మాదురోపై నార్కో-టెర్రరిజం ఆరోపణలు మోపి, ఆయన అరెస్టుకు 50 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది. 2025లో ట్రంప్ పరిపాలన మాదురోను అధికారికంగా విదేశీ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పుడు, 2026 తొలి వారంలోనే, అమెరికా మాదురో (Nicolas Maduro) పాలనకు పూర్తిగా తెరదించిందని ప్రకటించింది. ఈ చర్యతో అమెరికా తన సైనిక ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించగా, వెనిజులా మరో వామపక్ష పాలన పతనానికి సాక్ష్యంగా నిలిచింది.
Read Also: మేడారం భక్తులకు టోల్ ఫ్రీ!.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)


