కలం, వెబ్ డెస్క్ : నగరంలోని ఉప్పల్(Uppal) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా కానిస్టేబుల్ (Woman constable) ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల, ఉప్పల్ పద్మావతి కాలనీలోని మూడు అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలవ్వగా, గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమీల (Woman constable) స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రవి పహార్ తండా, కాగా ఉద్యోగ రీత్య నగరంలో ఉంటోంది. అయితే గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, పద్మావతి కాలనీలోని భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి వెనుక ఉన్న పూర్తి కారణాలను విచారణ ద్వారా తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read Also: న్యూ ఇయర్ వేడుకలు.. ఓఆర్ఆర్ పైకి ఆ వాహనాలకు నో ఎంట్రీ
Follow Us On: X(Twitter)


