కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌ను భారీ తుఫాన్ (UP Weather Fury) అతలాకుతలం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్కరోజులోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పలుచోట్ల గోడలు, ఇళ్లు, చెట్లు కూలిపోవడంతో భారీ నష్టం సంభవించింది.
ప్రయాగ్‌రాజ్ జిల్లాలో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అక్కడ ఒక్క జిల్లాలోనే 21 మంది మృతి చెందినట్లు సమాచారం. గాలివాన తీవ్రతకు పలుచోట్ల పాత ఇళ్లు, గోడలు కూలిపోవడంతో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టి ఇళ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి.
తుఫాన్ బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలమైన ఈదురుగాలి కారణంగా ఓ వ్యక్తి గాలిలోకి ఎగిరిపోయి సుమారు 50 అడుగుల దూరంలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో అతడిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ప్రధాన రహదారులు దిగ్బంధం అయ్యాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించారు. వాతావరణశాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగవచ్చని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: విజయ్ దారిలో వీడీ.. పినరయి విజయన్‌ను కలిసిన సతీశన్
Follow Us On: Instagram

