కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతలు కోసిన ధాన్యాన్ని కల్లాల్లో నుంచి తెచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని, వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతులకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు.

