కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకునే సమయానికి ఈదురుగాలులు వడగండ్లు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 20 రోజుల్లో మూడు సార్లు అకాల వర్షాలు కురవడంతో వేలాది ఎకరాల్లో రైతులు నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 6,793 మంది రైతులకు నష్టం వాటిల్లింది. అకాల వర్షం కారణంగా కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా జిల్లాలో అత్యధికంగా వరికి నష్టం వాటిల్లింది.
దెబ్బతిన్న పంటలు
అకాలవర్షాలతో మొక్కజొన్న, మామిడి, అరటి, బొప్పాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 5న కురిసిన అకాల వర్షం, వడగండ్లతో సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, సాలూర మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో 3,985 మంది రైతులకు చెందిన 6,088 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా వరి 5,065 ఎకరాల్లో, మొక్కజొన్న 826 ఎకరాల్లో, మామిడి 138 ఎకరాల్లో, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో నష్టపోయింది. గత నెల 31న కురిసిన ఆకాల వర్షానికి 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 95 శాతం వరి పంట దెబ్బతిన్నది.
ఆ మూడు మండలాల్లో తీవ్రనష్టం
18, 19 తేదీల్లో వడగళ్లతో కురిసిన ఆకాల వర్షం కారణంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో 590 మంది రైతులకు చెందిన 813 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. సిరికొండ మండలంలోని 9 గ్రామాల పరిధిలో 526 మంది రైతులకు చెందిన 691 ఎకరాల్లో, ధర్పల్లి మండలానికి చెందిన ఒక గ్రామంలో 28 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో, ఇందల్ మండలంలోని రెండు గ్రామాల్లో 45 మంది రైతులకు చెందిన 60 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇలా ఒక నెల వ్యవధిలోనే 20 రోజుల్లో మూడు సార్లు అకాల వర్షాలు రైతులను నిండా ముంచేసి కోలుకోలేని దెబ్బ తీశాయి. తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

