కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లావ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో జిల్లాలో సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ వర్షం అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ తీసింది. జనగామ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మొక్కజొన్న రాశులు నీట మునిగాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటికి మక్కలు, వడ్లు కొట్టుకుపోవడమే కాకుండా, తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తడిసిన మక్కలను తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్‌లో షెడ్ల సౌకర్యం పెంచి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

