కలం, వెబ్ డెస్క్ : కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు కొత్త నిబంధనలను (ATM New Rules) అమలులోకి తెస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి వంటి ప్రముఖ బ్యాంకులతో పాటు మరికొన్ని బ్యాంకులు నగదు ఉపసంహరణ పరిమితులు మరియు ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇకపై ఏటీఎంలలో కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై అదనపు భారం పడనుంది. ప్రతి లావాదేవీకి 23 రూపాయల వరకు ఛార్జీ వసూలు చేయడంతో పాటు, దానికి అదనంగా వర్తించే పన్నులను కూడా ఖాతాదారులే భరించాల్సి ఉంటుంది.
కేవలం ఛార్జీల పెంపు మాత్రమే కాకుండా, డెబిట్ కార్డుల ద్వారా రోజువారీ నగదు విత్ డ్రా చేసుకునే పరిమితిని కూడా బ్యాంకులు భారీగా తగ్గించాయి. ప్రస్తుతం ఉన్న పరిమితిని ఏకంగా సగానికి కుదిస్తుండటంతో సామాన్య ఖాతాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ, అత్యవసర సమయాల్లో నగదు కావాలనుకునే వారికి ఇది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఖాతాదారులు తమ బ్యాంకు అందించే తాజా అప్‌డేట్‌లను గమనించి, ఆ మేరకు తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

