కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ (Revanth government)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ 2024 – 25 నివేదిక రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ఏడాదిలో రెండు రోజులు తప్ప మిగిలిన 363 రోజులు రిజర్వ్ బ్యాంకు నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీస్, ఓవర్ డ్రాఫ్ట్ ల పేరుతో చేబదుళ్లు చేసిందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇలా రూ.1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చిందని చెప్పారు. చేబదులుగా తెచ్చిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తిరిగి చెల్లించాల్సి ఉండగా.. 2025 మార్చి 31 నాటికి సుమారు రూ.6 వేల కోట్లు చెల్లించలేకపోయిందని దుయ్యబట్టారు.
నెలకు సుమారు రూ.12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న మన రాష్ట్ర ఖజానాలో రోజువారీ ఖర్చులకు రూ.1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటేన్ చేయలేని స్థితికి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు. రూ.8.65 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాపుతూ ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ‘సంపద పెంచుతాం.. దానిని పేదలకు పంచుతాం’ అన్న కాంగ్రెస్ నాయకుల మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో బట్టబయలు అయ్యిందని దుయ్యబట్టారు.

