Mobile Popup Ad
Mobile Popup Ad

సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు సీజేఐతో కలిపి ఉన్న 34 మంది జడ్జీల సంఖ్యను 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో పాటు 33 మంది జడ్జిలు విధులు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరో నలుగురు న్యాయమూర్తులను పెంచేందుకు వీలుగా సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టం-1956కు సవరణ చేస్తూ, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఆమోదం లభించిన వెంటనే ఈ పెంపు అమలులోకి వస్తుంది.

1956: సుప్రీంకోర్టులో సీజేఐ మినహా కేవలం 10 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండేవారు.
1960 అండ్ 1977: క్రమంగా ఈ సంఖ్యను 13కు, ఆ తర్వాత 17కు పెంచారు.
1986: జడ్జిల సంఖ్యను 17 నుంచి 25కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
2009: మరో సవరణ ద్వారా ఈ సంఖ్యను 30కి పెంచారు.
2019: చివరిసారిగా జరిగిన సవరణతో జడ్జిల సంఖ్య 30 నుంచి 33కి (సీజేఐ కాకుండా) పెరిగింది.
ప్రస్తుత ప్రతిపాదన అమలైతే.. భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుతుంది. దీనివల్ల కేసుల విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

విమాన సంస్థల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్..

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ సవాళ్లు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ, విమానయాన సంస్థలు, ఇతర కంపెనీలకు కేంద్రం ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థలు ఆర్థిక అవసరాలు తీర్చడంలో సాయపడేందుకు రూ.18,100 కోట్లతో అత్యవసర రుణ హామీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంతో మొత్తం రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ ప్రవాహం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రభావితమైన విమానయాన సంస్థలతో పాటు ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఆయా వ్యాపారాలను నిలబెట్టడంతో పాటు, ఉద్యోగాలు కోల్పోకుండా నివారిస్తుందన్నారు. సప్లయ్‌ చైన్‌ అవరోధాలనూ నివారించడానికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు.

Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏఐసీసీ నాయకులతో చర్చ

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>