కలం, హుస్నాబాద్: దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం సాకారం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో పొన్నం కోమల – సమ్మయ్య ముదిరాజ్ దంపతులకు ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై, నిర్మాణం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులైన కోమల – సమ్మయ్య దంపతులకు నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇందిరమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ప్రజా పాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతోందని, ఈ దీపావళి పండుగను తమ సొంత ఇందిరమ్మ ఇళ్లలో జరుపుకుంటున్న లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఆ ఇళ్లలో ఈరోజు దీపావళి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి మరో 1,000 ఇందిరమ్మ ఇళ్లు
500 గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మధ్యలో నిలిచిపోయిన మరో 500 ఇళ్లకు, రెండో దశలో అదనంగా 1,000 ఇళ్లకు మంజూరులు లభించాయని చెప్పారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం, పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రూఫ్ లెవల్లో ఉన్న లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీలో పూర్తయిన ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ తమ సొంతింట్లో దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరి, ఈరోజు నా అక్కాచెల్లెళ్లు ప్రజా పాలన ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ ఛైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

