కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ నాయకులను కలిసి కేరళతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర తాజా అంశాలపై సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ను కలిసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు.. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై జరిగిన ఆర్థిక అక్రమాలపై జస్టిస్ లోకూర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సీబీఐ ఎంక్వయిరీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌కు ముఖ్యమంత్రి గుర్తు చేయనున్నట్లు సమాచారం.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించిన అక్రమాలపై విచారణ కమిషన్ సమర్పించిన నివేదికను కేబినెట్ సమీక్షించింది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉన్న నేపథ్యంలో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

