కలం, ఖమ్మం బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల ప్రత్యేక గ్రాంట్ అందిస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలంలో 2.5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.
సాగునీటి రంగంలో మైలురాయిగా నిలిచే మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తామని మంత్రి తుమ్మల (Minister Thummala) వెల్లడించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. అలాగే మండలంలో మూడో పంటకు కూడా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని ఆయన సూచించారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందుందని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి వివరించారు. మహిళల కోసం నాణ్యమైన చీరలను పంపిణీ చేయడంతో పాటు, పెద్ద వయసు వారికి ప్రత్యేక డిజైన్లను అందించామని ఆయన గుర్తు చేశారు.
Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వం
Follow Us On : WhatsApp


