కలం, ఖమ్మం బ్యూరో: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం నడుస్తోంది. వేలం పాటలు నిర్వహించి సర్పంచ్ పోస్టులను బహిరంగంగా విక్రయానికి పెడుతున్నారు. ఒక్కో గ్రామంలో 40 లక్షలు, 50 లక్షలుపైగా వేలం పాట సాగుతోంది. ఇలా జరగడం రాజ్యాంగవిరుద్ధమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ఉండకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) మూడో తేదీనే నామినేషన్ల విత్ డ్రా పూర్తయిన విషయం తెలిసిందే. బరిలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలివిడతలో 35 గ్రామ పంచాయతీలు 500 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 395 గ్రామాలు, 9,330 వార్డుల్లో పోటీ లేదు. ఏకగ్రీవాల్లో(Unanimous) మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులే గెలుచుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
ఏకగ్రీవం అంటే ఏమిటి?
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థిగా లేదంటే వార్డు సభ్యుడిగా కేవలం ఒకే ఒక్క అభ్యర్థి బరిలో ఉంటే దాన్ని ఏకగ్రీవ ఎన్నిక అంటారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానాల్లో చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 1972లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ విధానాలకు ఆకర్షితులైన ప్రజలు చాలా నియోజకవర్గాలను ఏకగ్రీవం అయ్యాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత విజయమ్మ 2010లో పులివెందుల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరూ పోటీ చేయకుండా ఉంటారు. అయితే ప్రస్తుతం వేలంపాట నిర్వహించి ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుండటం గమనార్హం. లక్షల రూపాయలు పెట్టి వేలం పాటలో సర్పంచ్ పదవి దక్కించుకున్న వారు ఆ ఊరికి, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తారా? అనేది ఒక పెద్ద ప్రశ్న.
Panchayat Elections లో ఏకగ్రీవం వల్ల లాభాలు
ఎన్నికల కోసం అభ్యర్థులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది. ప్రచారం, మద్యం పంపిణీ ఉండదు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు. అధికారుల సమమయం ఆదా అవుతుంది. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది. ఏకగ్రీవం వల్ల అధికారులకు, ప్రభుత్వానికి కొంత లాభం ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయి. ఏకగ్రీవ ఎన్నికలో ప్రజల భాగస్వామ్యం తగ్గుతుంది. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. సదరు అభ్యర్థిని కొందరు ఓటర్లు వ్యతిరేకించవచ్చు.. కానీ అసలు వారికి ఓటు వేసే అవకాశమే ఉండదు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ప్రజలకు జవాబుదారిగా ఉండకపోవచ్చు.
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పోరాటం
పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్ని కల సంఘం ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసింది. ‘రైట్ నాట్ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాను ఎంచుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల నోటాను ఎంచుకునే హక్కును ఓటర్ కోల్పోతున్నాడు. దీనిపై ఫోరం ఫర్గుడ్గవర్నెన్స్ ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ లేఖలో కోరింది. అందుకే ఒక్క నామినేషన్వచ్చినా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్ మాత్రమే మిగిలినా.. ఏకగ్రీవానికి తావులేకుండా నోటాను అభ్యర్థిగా ఉంచి, ఓటింగ్ పెట్టాలన్నది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్.
కొనసాగుతున్న ప్రలోభాలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఏకగ్రీవాలు పార్టీల పరంగా చేసుకుంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు డబ్బు ఆశ చూపి, వారు విత్ డ్రా చేసుకోవాలని ప్రలోభ పెడుతున్నారు.నేడు జరుగుతున్న ఏకగ్రీవాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదు. ఏకగ్రీవాలను ప్రశ్నించే స్థాయికి ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడే అక్రమ ఏకగ్రీవాలు నివారించగలుగుతాము.
– దొడ్డి కృష్ణ, మణుగూరు
న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి
న్యాయ స్థానాలు ఏకగ్రీవాల విషయంలో జోక్యం చేసుకోవాలి. సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని,ప్రభుత్వాలను ఆదేశించాలి. ఎక్కడైనా అక్రమ ఏకగ్రీవాలు జరిగినట్టు ఫిర్యాదులు వస్తే వెంటనే వాటిని రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి.
– వెంకటేశ్వర్ రావు, టీచర్
Read Also: పుష్ప గురించి చెప్పావ్.. శ్రీతేజను మర్చిపోయావా బన్నీ
Follow Us On: Pinterest


