Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ రైతుల కల నెరవేరేదెప్పుడు?

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా రైతాంగం దశాబ్దాల కల బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం (Udaya Samudram Project). అది ప్రస్తుతం ఒక అసంపూర్ణ ఘట్టంలా మిగిలిపోయింది. రిజర్వాయర్ కట్ట పూర్తై నీళ్లు ఎత్తిపోసేందుకు మోటార్లు సిద్ధమైనా.. ఆ నీటిని పొలాలకు మళ్లీంచే కాల్వలు మాత్రం ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయి. ఓవైపు ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రకటనలు వస్తున్నా.. క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న కిలోమీటర్ల కొద్దీ కాలువ పనులు సామాన్య రైతును వెక్కిరిస్తూనే ఉన్నాయి. రిజర్వాయర్ నిండా నీళ్లు ఉన్నా.. పొలానికి పారే దారి లేక రైతన్న కళ్లు వాచిపోతున్నాయి. దాదాపు లక్ష ఎకరాల సాగునీరు, 127 గ్రామాలకు తాగునీరు అందించాలనే మహత్తర ఆశయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నల్లగొండ, నకిరేకల్, మునుగోడు వంటి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఇది ఒక సంజీవని లాంటిది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ప్రాజెక్టు గుండెకాయ లాంటి రిజర్వాయర్ కట్ట (3,665 కి.మీ.) పూర్తయినా కాలువలు మాత్రం అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

అంకెల్లో అసలు ‘నిజం’

ప్రాజెక్టు ఎడమ కాలువ పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా కుడి కాలువ దారుణమైన జాప్యానికి గురవుతోంది. ఎడమ కాలువ 6.5 కిలోమీటర్లకు గాను 6.10 కిలోమీటర్లు పూర్తయ్యింది. కేవలం 400 మీటర్ల పని పెండింగ్‌లో ఉండటం వల్ల 43 వేల ఎకరాలకు నీరందే అవకాశం చేజారిపోతోంది. కుడి కాలువ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 25.50 కిలోమీటర్లకు కేవలం 9 కి.మీ. మాత్రమే పూర్తయ్యాయి. అంటే ఇంకా 65 శాతం ప్రధాన కాలువ పని పెండింగ్‌లో ఉంది. పొలాలకు నీటిని తీసుకెళ్లే చిన్న కాలువల (డిస్ట్రిబ్యూటరీస్) పరిస్థితి మరీ అగమ్యగోచరం. 99.5 కి.మీ. పనులకు గాను కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఈ పనుల జాప్యానికి కారణాలు లేకపోలేదు. పాత ఒప్పందాల ప్రకారం పనులు చేయడం కాంట్రాక్టర్లకు భారంగా మారింది. పెరిగిన ముడిసరుకు ధరలతో పాత రేట్లకు పనులు సాధ్యం కావని వారు చేతులెత్తేశారు. కొత్త రేట్లతో పనులు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్లను నియమించే ఫైలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంది. ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రచారం జరుగుతున్నా, పంపిణీ వ్యవస్థ సిద్ధం కాకపోవడం ప్రణాళికా లోపాన్ని ఎత్తిచూపుతోంది.

ఎదురుచూపులు ఎప్పటివరకు

ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో (Udaya Samudram Project) నీటిని ఎత్తిపోసే యంత్రాలు సిద్ధంగా ఉన్నా ఆ నీటిని పారించేందుకు కాలువలు సిద్ధంగా లేవు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న 8 మండలాల రైతులు ఎండకాలంలో సాగునీటి కోసం, తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఆమోదించి పనులు పూర్తి చేయిస్తేనే ఉదయసముద్రం ఆశయం నెరవేరుతుంది. లేదంటే అది నిరూపయోగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Read Also: రైల్వే బ్రిడ్జి పనుల్లో జారిపడ్డ కార్మికులు.. పరిస్థితి విషమం..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>