బీఆర్ఎస్ కుట్రలకు బలికావొద్దు.. వికారాబాద్ రైతులకు శ్రీధర్ బాబు రిక్వెస్ట్

కలం, వెబ్ డెస్క్: రైతుల దీక్షకు సంఘీభావం పేరిట రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నేతలకు తగదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) హితవు పలికారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలో జరుగుతున్న భూసేకరణపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు, పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లేందుకే ‘రాజకీయ యాత్ర’లు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పాలనలో వికారాబాద్‌ తీవ్ర వెనుకబాటుకు గురైందన్నారు. వికారాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోంటే ఓర్వలేకే మొసలి కన్నీరు కారుస్తున్నారని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు.

తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తోంటే, చూసి తట్టుకోలేకే మాపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. పెట్టుబడులు రాకుండా… యువతకు ఉపాధి దక్కకుండా అసత్యాలను ప్రచారం చేస్తూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ‘కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూములు అవసరం. ఇప్పటికే ఆపరేషన్ లో ఉన్న చందనవెల్లి, సీతారాంపూర్ తదితర ఇండస్ట్రియల్ పార్కుల్లో కొత్త యూనిట్లకు కేటాయించేందుకు భూములు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల ఉన్నా.. న్యాయపరమైన వివాదాలు, యాక్సెస్ రోడ్డు అందుబాటులో లేదు. ఇలాంటి తరుణంలోనే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్‌ను  అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం’ అని వివరించారు.

‘పారిశ్రామికాభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడిన వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిధిలోని కొడంగల్, పరిగి తదితర ప్రాంతాలను ఎంపిక చేశాం. కొడంగల్, కోస్గి, దోమ, పరిగి తదితర ప్రాంతాల కనెక్టివిటీని పెంచేందుకు.. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రేడియల్ రోడ్డు, ఆర్ఆర్ఆర్‌ను ప్రతిపాదించాం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైన మేరకు మాత్రమే భూసేకరణ చేయబోతున్నాం. అదీ కూడా నిబంధనల ప్రకారమే. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం డీపీఆర్‌ను తయారు చేస్తాం. ప్రభుత్వం నుంచి 10-ఏ జీవో తీసుకున్న తర్వాతే పరిగి (Parigi) మండల పరిధిలోని రాపోల్, కాడ్లాపూర్ లో భూసేకరణకు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్ ను టీజీఐఐసీ కోరింది’ అని స్పష్టం చేశారు.

‘భూముల్ని కోల్పోయిన వారికిచ్చే నష్ట పరిహారం విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. చట్ట ప్రకారం నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ బెనిఫిట్ కింద ఇళ్ల స్థలాల్ని అందజేస్తున్నాం’ అని వివరించారు. ‘ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వికారాబాద్ ప్రాంత రూపురేఖల్ని మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడికి పరిశ్రమలొస్తే స్థానిక బిడ్డలకు ఉద్యోగాలొస్తాయి. వలసలు ఆగిపోతాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. వికారాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా సాగుతున్న బీఆర్ఎస్ కుట్రలో భాగస్వామ్యం కావొద్దు’ అని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని, వారి త్యాగాన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని సహకరించాలని కోరారు.

Read Also: ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం.. అదే మా పంథా: కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>