కలం తెలంగాణ బ్యూరో: హైడ్రా (HYDRAA) ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, పార్కుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపులో తనదైన ముద్ర వేసింది. కూల్చివేతలు, ఎంపిక చేసిన లక్ష్యాలపైనే చర్యలు తీసుకుంటోందనే ఆరోపణలు, కోర్టు వివాదాలు, రాజకీయ విమర్శలనూ ఎదుర్కొంటున్నది. నగరంలో నాలుగు చెరువులను కబ్జాల నుంచి కాపాడి భారీ ఖర్చుతో బ్యూటిఫై చేసి ప్రజలకు వినియోగంలోకి తెచ్చి ప్రశంసలందుకున్నది.
కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూముల్ని కాపాడినందుకు పలు కాలనీల్లోని వెల్ఫేర్ అసోసియేషన్స్ హైడ్రాకు మద్దతుగా సంఘీభావ ర్యాలీలూ నిర్వహించాయి. హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి వ్యవస్థలను నెలకొల్పాలంటూ ముఖ్యమంత్రికి బహిరంగంగానే విజ్ఞప్తులు వచ్చాయి. ఈ రెండేండ్లలో 3,315 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించామని, మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా ఆదివారం ప్రకటించింది.
బహదూర్‌గూడ ఘటనలో 36 మందిపై కేసులు
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడ ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలతో స్థానిక రైతులు, మహిళలు, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సహా మొత్తం 36 మందిపై కేసులు నమోదయ్యాయి.
కేసు నమోదైన వారిలో పటోళ్ల కార్తిక్‌రెడ్డి, పంతంగి భూపాల్‌రెడ్డి, మహేందర్, కోలన్ ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటన అనంతరం బహదూర్‌గూడ గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. గ్రామంలోకి బయటి వ్యక్తులు రాకుండా పహారా ఏర్పాటైంది. మరోవైపు 650 ఎకరాల ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి.

