కలం, తెలంగాణ బ్యూరో: సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో (Private Universities) తనిఖీలు నిర్వహించిన ప్రత్యేక కమిటీ నివేదికను రూపొందిస్తున్నది. దాని ఆధారంగా ప్రభుత్వం సైతం అఫిడవిట్‌ను త్వరలో దాఖలు చేయనున్నది. ప్రస్తుతం ఈ రెండు పనులూ ముమ్మరంగా జరుగుతున్నాయి. ‘అమిటీ యూనివర్సిటీ’ వ్యవహారంలో (ఆయేషా జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా) దాఖలైన ఒక పిటిషన్‌ను గతేడాది విచారించిన జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ప్రైవేటు యూనివర్సిటీలపై సమగ్ర వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు యూనివర్సిటీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. వాటిని ఏర్పాటు చేస్తున్న సంస్థలు, వ్యక్తుల లక్ష్యాలేమిటి? అక్కడ బోధిస్తున్న అధ్యాపకుల విద్యార్హతలు, అనుభవం ఏమిటి? ప్రవేశ పరీక్షలు, నియామక విధానం, విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
సీసీఈ అధ్యక్షతన కమిటీ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు యూనివర్సిటీల తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ (సీసీఈ) అధ్యక్షతన ఇటీవల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) కార్యదర్శిని కన్వీనర్‌గా, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ను సభ్య కన్వీనర్‌గా నియమించింది. పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, సాంకేతిక విద్య కమిషనరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ (అకడమిక్-సి)లను సభ్యులుగా చేర్చింది.
అవసరమైతే సంబంధిత సబ్జెక్టు నిపుణుడిని సహ సభ్యుడిగా నియమించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు యూనివర్సిటీని సందర్శించి సుప్రీంకోర్టు నిర్దేశించిన తొమ్మిది అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. తనిఖీల ద్వారా సేకరించిన వివరాలతో సమగ్ర నివేదిక, అఫిడవిట్‌ను సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ అఫిడవిట్‌ను త్వరలో సుప్రీం కోర్టులో దాఖలు చేయనుంది. అనంతరం సుప్రీంకోర్టు జారీ చేసే తదుపరి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టనుంది.

