కలం, వెబ్ డెస్క్: ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు (El Nino Action Plan) శ్రీకారం చుట్టింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన, నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, తాగునీటి భద్రత, గ్రామీణ ఉపాధి కల్పన వంటి అంశాలపై మిషన్ మోడ్ తో చర్యలు చేపట్టింది. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేయగా.. సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం 10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులైన అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ‘జలసిరి’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
ఎల్‌నినో ప్రభావం నుంచి రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రకృతి పరిస్థితులను ఎదుర్కోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుంటూ అధికారులు ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్సింగ్, సంజయ్కుమార్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేయర్లు, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వర్షాలు పెద్దగా పడకపోవచ్చు..!
ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లోని ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా, రైతులకు అవగాహన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలపై కూడా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని, అందువల్ల ముందస్తు చర్యలే ప్రజలను రక్షిస్తాయని తెలిపారు.
నీటి పొదుపు చైతన్యం తేవాలి
తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటి వినియోగంలో పొదుపు పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించాలని తెలిపారు. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని మంత్రి తెలిపారు.
కరోనా స్ఫూర్తితో ఎల్‌నినోను అధిగమిద్దాం..
రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలు ఇంకుడు గుంతలు నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమష్టిగా పనిచేసి సంక్షోభాన్ని అధిగమించినట్లే, ఎల్‌నినో కారణంగా ఏర్పడే పరిస్థితులను కూడా సమన్వయంతో ఎదుర్కోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు.
పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు, రాబోయే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీబీ జీరామ్ జీ (ఉపాధి హామీ పథకం) కింద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నది. మంత్రి సీతక్క ఆదేశాలతో సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
9.60 లక్షల ఇంకుడు గుంతలు..
– ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి మొత్తం 12 కోట్ల పనిదినాలు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా జులై నుంచి అక్టోబర్ వరకు తొలి దశలో 4.5 కోట్ల పనిదినాలు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు.
– ప్రస్తుతం రోజుకు సుమారు 2.5 లక్షల మంది కూలీలకు ఉపాధి లభిస్తుండగా, అదనంగా మరో 2.5 లక్షల పనిదినాలు కల్పించి రోజుకు 5 లక్షల మందికి ఉపాధి అందించేలా జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
– ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నీటి సంరక్షణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 9.60 లక్షల ఇంకుడు గుంతలు, 25 వేల పంట కుంటలు, 5 వేల ఊట కుంటలు, 5 వేల బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.
– వనమహోత్సవం, గ్రామ పంచాయతీ భవనాలు, వీఓ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయనున్నారు.
– తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఇంటి వద్ద సోక్పిట్లు, రైతుల కోసం పంట కుంటలు, వర్షపు నీటిని నిల్వ చేసే పర్కొలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అవసరమైతే మరిన్ని శిక్షణలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
నేడ ఐఏఎస్ ల రివ్యూ..
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, క్షేత్రస్థాయిలో తాజా పరిణామాలు, ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పది ఉమ్మడి జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించిన ప్రభుత్వం.. సోమవారం ఆయా జిల్లాలకు వెళ్లి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆయా జిల్లాలకు కేటాయించిన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమీక్షించాల్సిన అంశాలు, సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు.
రివ్యూలో చర్చించే అంశాలు ఇవే..
ఆయా జిల్లాల్లో సాధారణ వర్షపాతం, ఇప్పటివరకు నమోదైన వర్షాలు, భూగర్భ జలాల స్థాయి, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, తాగునీటి పరిస్థితి, వ్యవసాయం, ఉద్యాన పంటల తాజా పరిస్థితి, విద్యుత్ సరఫరా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా సమీక్ష చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అన్ని జిల్లాల్లో సమీక్షలు పూర్తయిన అనంతరం రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
• జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ : వర్షపాతం, ప్రభుత్వ సూచనలు, వాతావరణ వివరాలు
• జిల్లా వ్యవసాయ అధికారి : సాగు విస్తీర్ణం, తాజా పరిస్థితి, వర్షాభావం, కంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక పంటల సాగు, విత్తనాల లభ్యత
• హార్టికల్చర్ ఆఫీసర్ : ప్రత్యామ్నాయ పంటలకున్న ఆస్కారం, మైక్రో ఇరిగేషన్, కూరగాయల సాగు
• ఇరిగేషన్ ఈఈ : అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టుల తాజా స్టేటస్, నీటి లభ్యత, సాగునీటి సరఫరా
• గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ : ఆ జిల్లాల్లోని నిర్దిష్ట మండలాల్లో భూగర్భ నీటి వనరులు, ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకత
• డిస్కంల ఎస్ఈ : జిల్లాలో విద్యుత్ డిమాండ్ సరఫరా, వ్యవసాయ వినియోగం
• మున్సిపల్ కమిషనర్ : అర్బన్ వాటర్ బడ్జెట్, తాగునీటి లభ్యత, కంటింజెన్సీ ప్రణాళిక అమలు
• పంచాయతీరాజ్ ఈఈ : గ్రామీణ తాగునీటి వ్యవస్థ తాజా స్థితి, గ్రామీణ ఉపాధి హామీ
• పశుసంవర్థక జిల్లా ఆఫీసర్ : పశుగ్రాసం లభ్యత, నిల్వ, వాటికి తాగునీటి వసతి, ఆరోగ్యం, సీజనల్ పరిస్థితికి సన్నాహాలు
• కృషి విజ్ఞాన్ కేంద్రం : జిల్లా/మండలంలోని నేల సాధారణ స్వభావం, అనుకూలించే పంటలు, పురుగుమందులు-ఎరువుల వినియోగం, రైతాంగానికి సూచనలు

