కలం వెబ్ డెస్క్ : అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచ్‌లు(Two Sarpanches) ప్రమాణ స్వీకారానికి రెడీ అవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఏ రాష్ట్రంలో అయిన సాధారణంగా ఏ ఎన్నికలు(elections) వచ్చినా ఒక్క అభ్యర్థి గెలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం గెలిచింది ఒక్కరు కాదు ఇద్దరు., దీంతో ఇద్దరూ ప్రమాణస్వీకారానికి రెడీ అవుతున్నారు. అధికారులే సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులకు గెలుపు సర్టిఫికెట్లు ఇవ్వడం విశేషం.
గ్రామాల్లో నేడు సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ ఘటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓట్ల లెక్కింపు రోజు మొదటగా బీఆర్ఎస్(BRS) మద్దతుదారు స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి (RO) అధికారికంగా ప్రకటించి, ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. గెలిచామన్న ఆనందంతో స్వాతి వర్గం సంబరాలు మొదలు పెట్టింది. అయితే, సరిగ్గా అరగంట గడవకముందే సీన్ రివర్స్ అయింది. రీ-కౌంటింగ్, కారణమేదైనా కానీ, అధికారులు ఒక్కసారిగా కాంగ్రెస్(Congress) మద్దతుదారు సుజాత ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించి ఆమెకు కూడా విక్టరీ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎన్నికల్లో గెలిచినట్లు ఎన్నికల అధికారి నుంచి అధికారిక పత్రాలు అందడంతో ఇద్దరు అభ్యర్థులు తమ బంధువులను, సన్నిహితులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇద్దరూ సర్పంచులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో.. ఎవరు సర్పంచ్ పీఠం ఎక్కుతారో వేచిచూడాలి.


