కలం, వెబ్‌డెస్క్: తమిళనాడులో టీవీకే (TVK) ప్రభుత్వం కొలువు దీరడం, సీఎంగా విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం ఆలస్యం అవుతుందన్న ఆవేదనతో విజయ్ అభిమాని, టీవీకే కార్యకర్త ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. తిరునెల్వేలి జిల్లా సెట్టికుళం సమీపంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇసక్కియప్పన్ వల్లియూర్ యూనియన్ టీవీకే వాలంటీర్ల విభాగం డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంలో జరుగుతున్నఆలస్యంపై ఇసక్కియప్పన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఇసక్కియప్పన్ కన్యాకుమారి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.

