కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు గన్నీ సంచుల కొరత, లారీల సమస్యలు, మిల్లుల వద్ద తరుగు పేరుతో దోపిడీ.. ఇలా అన్నదాతను అన్ని వైపుల నుంచి ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. నెలల తరబడి కష్టపడి పండించిన ధాన్యం చేతికొచ్చే సమయానికి రైతు తీవ్ర ఆందోళనలో మగ్గిపోతున్నాడు. రుతుపవనాల రాక రైతుకు ఆనందం ఇవ్వాల్సింది పోయి కష్టాలను తెచ్చిపెడుతోంది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులలో ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దవుతోంది. సరిపడా టార్పాలిన్లు లేకపోవడం, డ్రైనేజీ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ధాన్యం రాశులు నీటిలో తడుస్తున్నాయి. ధాన్యం తూకం వేయడానికి సిద్ధంగా ఉన్నా గన్నీ సంచులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “సంచులు లేవు” అనే సమాధానం తప్ప అధికారుల నుంచి స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కొణిజర్ల (Konijerla) సమీపంలోని ఓ గోదాంలో వేల సంఖ్యలో గన్నీ బ్యాగులు నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. పైరవీకారులకు సంచులు ఇస్తూ, సాధారణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంచులు దొరికినా ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు అందుబాటులో లేవు. లారీ కాంట్రాక్టర్‌లు టన్నుకు రూ.1200 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.600 మాత్రమే చెల్లిస్తోంది. అంతేకాదు, మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ఆలస్యమైతే రోజుకు రూ.1000 నుంచి రూ.3000 వరకు అదనపు భారం పడుతోంది. కొంతమంది వ్యాపారులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్ని ఇబ్బందులు దాటి మిల్లుకు చేరిన తర్వాత కూడా రైతుకు ఊరట లేదు. వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉందని చెప్పి క్వింటాకు 5 నుంచి 10 కిలోల వరకు అదనపు తరుగు తీస్తున్నారు. నాణ్యత లేదని, తాలు ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ మద్దతు ధరలో కోతలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా ప్రైవేట్ దళారులకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2400 చెల్లిస్తుండగా, దళారులు కేవలం రూ.1600 వరకే ఇస్తున్నారు. అయినా ధాన్యం ఎక్కువ రోజులు రోడ్లపై ఉండటంతో విసిగిపోయిన రైతులు నష్టానికైనా అమ్మడానికి సిద్ధమవుతున్నారు.

