కలం, కరీంనగర్ బ్యూరో: దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) నగరంలోని కలెక్టరేట్ వద్ద అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి (PM Narendra Modi) బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ మాట్లాడుతూ.. ఒకవైపు దేశ యువతకు నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం “2 కోట్ల ఉద్యోగాలు” సృష్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారిక గణాంకాలు, నిరుద్యోగ సమస్య, ఖాళీ ప్రభుత్వ పోస్టులు, పెరుగుతున్న కాంట్రాక్టు విధానం నేపథ్యంలో ఆ హామీ పూర్తిగా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.
అదే విధంగా తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014 విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రధాన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. దీనిలో ప్రధానంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, ఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయాల పూర్తి స్థాయి అభివృద్ధి లేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదు, తెలంగాణ యువతకు భారీ ఉపాధి అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకుని రాజకీయ లాభాలు పొందడం తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని ఏఐవైఎఫ్ ఆరోపిస్తుందని అన్నారు.
భారత రైల్వేల పేరుతో వేలాది పోస్టులను తగ్గించే నిర్ణయం తీసుకోవడం దారుణమని, దీనిని AIYF తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దేశ యువత భవిష్యత్తుతో, తెలంగాణ ప్రజల ఆశయాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడితే ఊరుకోదని ఏఐవైఎఫ్ తరఫున హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక, యువత వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు, నిరసనలు, ముట్టడులు తీవ్రతరం చేస్తామని ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా నాయకులు శ్రీకాంత్, రవి నాయక్, అరవింద్, మురళి, అజయ్, ప్రశాంత్, కిరణ్ నాయక్, రవీందర్ నాయక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

