epaper
Monday, February 2, 2026
spot_img
epaper

డబుల్​ ఇంజిన్​, డబ్బా ఇంజిన్​ కాదు.. టాప్​ ఇంజిన్​దే అధికారం : విజయ్​

కలం, వెబ్​డెస్క్​: తమిళనాడులో అధికారం డబుల్​ ఇంజిన్​ది, డబ్బా ఇంజిన్​ది కాదని టాప్​ ఇంజిన్​దే అని సినీనటుడు, టీవీకే అధినేత విజయ్​(TVK Vijay) అన్నారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ రెండో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం చైన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో విజయ్​ పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగరేశారు. అనంతరం పార్టీ పదాధికారులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

టీవీకే ప్రభావం కేవలం అర్బన్​ ప్రాంతాల్లో మాత్రమే ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో లేదంటూ వస్తున్న విమర్శలను విజయ్​ తిప్పికొట్టారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎంజీఆర్​తో తనను తాను పోల్చుకొంటూ.. రాబోయే ఎన్నికల్లో టీవీకే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార డీఎంకే పాలనపై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీని ‘సిల్వర్​ జూబ్లీ జరుపుకుంటున్న చిన్నారి’ అంటూ వెక్కిరించారు.

‘డీఎంకే పాలనలో ప్రస్తుతం అరాచకం, అన్యాయం, మోసం రాజ్యమేలుతున్నాయి. వీటి గురించి మేము తప్ప ఎవరూ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. దుష్టశక్తి అయిన డీఎంకేను పవిత్రశక్తి అయిన టీవీకే మాత్రమే ఎదిరించగలదు. సీఎం స్టాలిన్​ తాను చేస్తున్న తప్పులను తెలుసుకొని, గాఢనిద్ర నుంచి మేల్కొన్నప్పడు ఆయన కూడా ‘విజిల్​’(టీవీకే గుర్తు)కు ఓటేయమని ప్రజలను కోరతాడు’ అని విజయ్ (TVK Vijay)​ అన్నారు.

అన్నాడీఎంకే సహా ఇతర పార్టీలేవీ తమకు పోటీ కావన్న విజయ్​.. డీఎంకేతోనే టీవీకేకు అసలైన పోటీ అని మరోసారి స్పష్టం చేశారు. ఎంజీఆర్​ పార్టీ పెట్టినప్పుడు అందరూ ఆయన్ని ఎలాగైతే విమర్శించారో అలాగే ఇప్పుడు తననీ అంటున్నారని పేర్కొన్నారు. ఎంజీఆర్​లాగే తానూ వెనకడగు వేయనని, ఆయనలాగే అధికారం సొంతం చేసుకుంటానని చెప్పాడు. తనపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ఇప్పటికీ పాత పద్ధతులనే వాడుతున్నారని, టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కాస్త బుద్ధి పెట్టి ఆలోచించాలని ప్రత్యర్థులకు చురకలు వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ టీవీకే ఉందని, ప్రతి ఇంట్లోనూ విజయ్ ఉన్నాడని పేర్కొన్నారు. ​పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మిగతాదంతా తనకు వదిలేయాలని కార్యకర్తలకు, కేడర్​కు విజయ్​ సూచించారు.

Read Also: కేసీఆర్​ ను ఎవరూ ఈడ్చుకురాలేదు : సీఎం రేవంత్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>