కలం, జోగులాంబ గద్వాల : రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా సమన్వయకర్త అర్చన (Archana) గురువారం యర్రవల్లి మండలంలోని తిమ్మాపూర్, బీచుపల్లి, యర్రవల్లి గ్రామాలలో ఆమె క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో పంట నష్టాలను (Crop Losses) సమీక్షించారు. వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు వరికి బదులుగా పప్పు దినుసులు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆమె అన్నారు.
వర్షాభావ పరిస్థితులు, పంటల కీలక దశల్లో నేలలో తేమ అందుబాటులో లేకపోవడం వలన పంటలు ఎండిపోవడం, రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాల గురించి రైతులతో చర్చించారు. రైతుల నుంచి ప్రస్తుత సాగు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీక్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులు, మహిళా రైతులతో సమావేశమై, ఎఫ్పిఓలో సభ్యత్వం పొందడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా సామూహిక మార్కెటింగ్, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాల లభ్యత, సాంకేతిక సలహాలు, మెరుగైన మార్కెట్ అవకాశాల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వేరుశనగ పొలంలో నిర్వహించిన రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో కూడా పాల్గొని రైతులతో పంట సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులు, పంట అభివృద్ధి దశలపై చర్చించారు. ఎఫ్పిఓ రైతుల వేరుశనగ, వరి పొలాలను సందర్శించారు. వేరుశనగ పంటలో పూత దశలో ఎకరానికి 200 కిలోల జిప్సం, 10 కిలోల యూరియా వేయాలని సూచించారు. వరి పొలాలను పరిశీలించగా నేలలో తేమ కొరవడటంతో పంట పూర్తిగా ఎండిపోయినట్లు గుర్తించారు. సందర్శించిన ప్రాంతంలో సుమారు 635 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయినట్లు రైతులు అధికారులకు వివరించారు. ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి సురేష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

