కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించి పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికలో ఎలాగైనా గెలవాలైనా లక్ష్యంగా యువతలో పట్టున్న నేతలను రంగంలోకి దించుతున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ (Hyderabad Rangareddy Mahabubnagar MLC) స్థానం కోసం ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా మారనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి పేరు ఖరారు చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ లలో టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రస్తుత ఎమ్మెల్సీ వాణిదేవి పదవీకాలం ఉంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించి నూతన ఎమ్మెల్సీని ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నూతన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఈనెల 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఎన్రోల్మెంట్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు.
గెలవాలని పట్టుదలతో బీజేపీ..
ఈ నియోజకవర్గంపై బీజేపీకి బలమైన పట్టు ఉంది. 2015లో ఈ స్థానాన్ని గెలుచుకున్న చరిత్ర ఉండటంతో, ఈసారి టికెట్ దక్కించుకుంటే విజయం సులభమని నాయకులు భావిస్తున్నారు. అందుకే ఇక్కడ ఆశావహుల జాబితా చాలా పెద్దదిగా ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఈ స్థానానికి బీజేపీ తరపున పోటీలో ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో 2015-2021 వరకు రామచంద్ర రావు ఎమ్మెల్సీగా పనిచేశారు.
బీజేపీలో ఆశావాహుల క్యూ ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారిలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, ఎన్ వి సుభాష్, షాద్నగర్ శ్రీ వర్ధన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ ప్రధాన అనుచరుడు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా నిలబడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీ హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న సహజమైన ఓటు బ్యాంకు తో పాటు రామచందర్ రావు వంటి బలమైన నాయకులు ఉండటం, మోదీ చరిష్మా , బిజెపి అభ్యర్థులు గెలవడానికి ఉపయోగపడతాయని పార్టీ భావిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నెట్వర్క్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన మాదిరిగానే ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి చూపిస్తామని ధీమాలో బిజెపి నేతలు ఉన్నారు.
సిట్టింగులు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఆరాటం..
సిట్టింగ్ సీటును కాపాడు కోవాలని వ్యూహంతో బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నిరుద్యోగ పట్టబద్రుల ఎన్రోల్మెంట్ కోసం ఉచిత ఎన్రోల్మెంట్ కార్యక్రమం వారి వారి నియోజకవర్గాల్లో నిర్వహించారు. ఆ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రచార పర్వంలో ముందుంటుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు ఈ ఎన్నిక చావో రేవో లాంటిది. సిట్టింగ్ సీటు కావడంతో ఇక్కడ గెలిచి తమ పట్టు నిరూపించుకోవాలని ఆశగా ఎదురుచూస్తుంది.
ప్రస్తుత ఎమ్మెల్సీగా సురభి వాణీ దేవి ఉన్నారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కుమార్తె కావడంతో ఈమెకు మంచి పేరు ఉంది. ఆమెనే మళ్ళీ బరిలో దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె వివాదరహితురాలు కావడం, విద్యావేత్తగా మంచి పేరు ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అలాగే యువతలో మంచి పట్టున్న , విద్యావేత్త అయిన దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తుంది. పార్టీ సీనియర్ నేతగా గ్రాడ్యుయేట్లను ఎంతోకాలంగా సమన్వయం చేస్తూ వస్తున్నారు. ఒకవేళ వాణీ దేవి పోటీకి దూరంగా ఉంటే, ప్రత్యామ్నాయంగా దాసోజు పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమకారుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నప్పటికీ, అధిష్టానం మాత్రం సిట్టింగ్ అభ్యర్థికే మొగ్గు చూపేలా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా పెద్దల సభలో పాలకపక్షాన్ని ధాటిగా ఎదుర్కొనే సత్తా ఉన్న వారికే ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఈ ఎన్నికలను పర్యవేక్షించడం కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్కు కలిసొచ్చేనా?
ఈ ఎన్నికల్లో విజయం ప్రధానంగా కొత్త ఓటరు నమోదు మీదనే ఆధారపడి ఉంటుంది. పాత ఓట్లు చెల్లవు కాబట్టి, ఎవరైతే ఎక్కువ మందిని నమోదు చేయిస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ముందుగానే ప్రకటించడం పార్టీలో చకచకా జరిగిపోయాయి. ఈ మేరకు ఆయన ప్రచారంలో సైతం దూకుడు పెంచారు. ఎలాగైనా సరే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్సీగా గెలవాలని గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అయినా నిరుద్యోగ సమస్యలు, జాబ్ క్యాలెండర్ హామీల అమలుపై యువతలో ఉన్న అసంతృప్తి రామ్మోహన్ రెడ్డి విజయ అవకాశాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండడం మూలంగా నిరుద్యోగులను, తమ వైపు తిప్పుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను సైతం తక్కువగా అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో కీలకం కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి కలిసొచ్చే ఛాన్స్ గా ఉండనుంది. అయితే, సంస్థాగత బలంతో కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి సర్వశక్తులూ ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
కొత్త పార్టీల అభ్యర్థులు కూడా రంగంలోకి..
యువతను తమ వైపు ఆకట్టుకుని తమ సత్తా ఏంటో చూపించాలని లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి అభ్యర్థులు రంగంలో ఉండనున్నట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని కుల సంఘాల నుండి కూడా అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ముదిరాజ్ అభ్యర్థి కూడా ఎమ్మెల్సీ బరిలో ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం మీద రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎవరు వైపు మొగ్గు చూపుతారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

