అభ్యర్థులను ప్రకటించిన టీవీకే.. ఆ రెండు స్థానాల్లో విజయ్ పోటీ!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ (Vijay) తన పార్టీ తరపున పోటీ చేయబోయే 234 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ పెరంబూర్ (Perambur), తిరుచ్చి ఈస్ట్ (Trichy East) అనే రెండు నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ 23న జరగనున్న ఈ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తోంది. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే, నామ్ తమిళర్ కచ్చితో తలపడుతూ తొలి ఎన్నికల్లోనే అధికారాన్ని దక్కించుకోవాలని విజయ్ వ్యూహరచన చేస్తున్నారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో విజయ్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.

కీలక నియోజకవర్గాల విషయానికి వస్తే టీ నగర్ నుంచి బుస్సీ ఆనంద్, విల్లివాక్కం నుంచి ఆదవ్ అర్జున, గోబిచెట్టిపాళయం నుంచి మాజీ మంత్రి సెంగోట్టయన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏఐఏడీఎంకే నుంచి వచ్చిన ప‌లువురు నాయ‌కుల‌కు కూడా విజయ్ సీట్లు కేటాయించడం గమనార్హం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు విజ‌య్ చెప్పారు. త‌మ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్లంతా కొత్త వాళ్లేన‌ని విజ‌య్ వెల్ల‌డించారు. సినిమా వాళ్లు గెల‌వ‌లేర‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, త‌న‌పై వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌కు త‌న‌ గెలుపుతోనే సమాధానం చెప్తాన‌ని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌జా సేవ చేసేందుకే వ‌చ్చాన‌ని విజ‌య్ అన్నారు. నిరుద్యోగుల‌కు రూ.4000 భృతి ఇస్తామ‌న్నారు. స్థానికుల‌కు ఉద్యోగాల్లో ప్రాధాన్య‌త ఇస్తామ‌ని, 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే వ‌చ్చేలా చూస్తామ‌ని చెప్పారు. త‌మిళ‌నాడులో వాలంటీవ‌ర్ వ్య‌వ‌స్థ తీసుకొస్తామ‌ని విజ‌య్ ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల‌ నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో, అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలని విజయ్ సూచించారు. స్వయంగా విజయ్ కూడా రేపే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఎన్నికలకు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, అభ్యర్థుల ప్రకటన ముగియగానే టీవీకే శ్రేణులు ప్రచారానికి సిద్ధ‌మ‌య్యేందుకు ప్ర‌ణాళిక‌ రూపొందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>