కలం, వెబ్ డెస్క్: బరువు తగ్గాలన్నా, పొట్ట దగ్గర కొవ్వు కరగాలన్నా చాలా మంది చేసేది ట్రెడ్‌మిల్‌పై గంటల తరబడి చెమటలు చిందించడం. చాలా జిమ్స్‌లో కూడా ట్రైనర్‌లు బరువు తగ్గాలనుకుంటున్న వారికి ముందుగా చెప్పేది కార్డియో చేయమని, కొన్ని రోజుల పాటు వారితో కార్డియోనే చేయిస్తారు. కానీ ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ డాన్ గో (Fitness coach Dan Go) మాత్రం కార్డియో ఒక చెత్త, వేస్ట్ అని అంటున్నారు. అది బరువు తగ్గడానికి ఏమాత్రం సహాయపడదని చెప్తున్నారు. బరువు తగ్గడానికి కార్డియో అనేది ఒక అసమర్థమైన మార్గమని, దానికంటే మెరుగైన మార్గాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు.
ఫిట్‌నెస్ ప్రపంచంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాన్ గో, బరువు తగ్గడంపై ఉన్న పాత అపోహలను తొలగించారు. కార్డియో వ్యాయామాలు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచివని ఆయన అంగీకరిస్తూనే, కొవ్వును కరిగించే విషయంలో మాత్రం అవి అంతగా పని చేయవని వివరించారు.
కార్డియో ఎందుకు ‘వేస్ట్’?
బరువు తగ్గడానికి (Weight Loss Tips) కార్డియో సరైనది కాదనడానికి ఆయన మూడు బలమైన కారణాలను చెప్పారు. మొదటిది, మనం అనుకున్నంతగా కార్డియో వల్ల కేలరీలు కరగవు. పదే పదే చేయడం వల్ల శరీరం దానికి అలవాటు పడి, కరిగే కేలరీల సంఖ్య తగ్గిపోతుంది. రెండోది, అతిగా కార్డియో చేయడం వల్ల ఆకలి విపరీతంగా పెరిగి, వ్యాయామం ద్వారా ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ ఆహారం తినేలా చేస్తుంది. మూడోది, ఇది కండరాల క్షీణతకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు.
అసలైన ‘సక్సెస్’ ఇలానే..
బరువు తగ్గడానికి డాన్ గో “వెయిట్ లిఫ్టింగ్ (బరువులు ఎత్తడం) + వాకింగ్ (నడక)” అనే కాంబినేషన్‌ను సూచించారు. ఇది ఒక బెస్ట్ కాంబో అని చెప్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చేయడం కండరాలను నిర్మిస్తుంది. దీనివల్ల మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా మన శరీరం కొవ్వును కరిగిస్తూనే ఉంటుంది. ఇది జీవక్రియను చురుగ్గా ఉంచుతుంది.
వ్యాయామ ప్రణాళికలో మార్పు చేసుకోవాలి..
వాకింగ్ అనేది తక్కువ శ్రమతో కూడిన వ్యాయామం. కీళ్లపై ఒత్తిడి లేకుండా, ఆకలి పెరగకుండా కొవ్వును కరిగించడానికి ఇది ఉత్తమమైన మార్గం. వ్యాయామం అనేది కేవలం కేలరీలు కరిగించడానికి మాత్రమే కాదు, ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తిండి తగ్గించడం అనేది ట్రెడ్‌మిల్‌పై కష్టపడటం కంటే సులభమైన మార్గమని ఆయన గుర్తు చేశారు. శాశ్వతంగా బరువు తగ్గాలనుకునే వారు తమ వ్యాయామ ప్రణాళికలో మార్పులు చేసుకోవడం మంచిది. సరైన ఆహారం, సరైన ఎక్సర్‌సైజ్‌ల కలయికతోనే ఆరోగ్యకరమైన మార్పు సాధ్యమవుతుంది.

