జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

కలం, జగిత్యాల: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జగిత్యాల నాయకులు డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల బావి వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి సహా పలువురు నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏఓ కిషన్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిలిపి వేసిన రైల్వే పాసులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే నాయకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, డిజిటల్ మీడియా కమిటీ సభ్యులు టీవీ సూర్యం, దాడుల కమిటీ సభ్యుడు ఆదిల్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, అల్లే రాము, హైదర్, రమణారెడ్డి, జిల్లా కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శులు చంద్రశేఖర్, రాజకుమార్, నరేష్, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్, ధర్మపురి, కొడిమ్యాల, గొల్లపెల్లి, మల్యాల, సారంగాపూర్, బీర్పూర్ మండలాల ప్రెస్ క్లబ్ బాధ్యులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, శశిధర్, బూరం సంజీవ్, అజీమ్, వినోద్, మల్లేశం, గోపి, వరప్రసాద్, గంగ మల్లయ్య, రాజకుమార్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరీష్, నరేష్, సాజిద్ పాషా, గౌస్, శంకర్ గౌడ్, మనోజ్, యూనియన్ సీనియర్ నాయకులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>