కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 90 శాతం సబ్సిడీపై జిప్సం ఎరువులను అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన “రైతు నేస్తం” 92వ ఎపిసోడ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని సుమారు 1,600 వేదికల ద్వారా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం ఎరువులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. భూసార ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలకపాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పంట దిగుబడుల్లో నేల ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుందని, రైతులు భూసార పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంలో పచ్చిరొట్ట పంటలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. ఈ తరుణంలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. గత వానాకాలం – 2025లో 0.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రూ.61.27 కోట్ల సబ్సిడీతో 1,89,395 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 7.05 లక్షల ఎకరాల్లో పచ్చిరొట్ట పంటల సాగు జరిగినట్లు వెల్లడించారు. రానున్న వానాకాలంలో 1.39 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ లక్ష్యంగా రూ.113.27 కోట్ల సబ్సిడీతో సుమారు 11.22 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.

