ఉమ్మడి నల్లగొండలో ఇందిరమ్మ లబ్ధిదారులకు తప్పని తిప్పలు

కలం, నల్లగొండ బ్యూరో : సొంతింటి కల సాకారం చేస్తామన్న సర్కారు హామీలు ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో మంజూరైన 36,501 ఇళ్లలో.. కనీసం 10 శాతం కూడా పూర్తికాకపోవడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది. సకాలంలో బిల్లులు రాక.. ఉన్న ఇళ్లను కూల్చుకుని, కొత్తవి కట్టుకోలేక వేలాది మంది లబ్ధిదారులు అద్దె ఇళ్లలో నరకం చూస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కరువై, నిధులు అందక ‘ఇందిరమ్మ ఇల్లు’ పేదలకు ఒక ప్రహసనంగా మారింది. క్షేత్రస్థాయిలో అందుతున్న నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణా లోపం వెరసి ఈ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. మొదటి విడత కింద ఉమ్మడి జిల్లాకు వేల సంఖ్యలో ఇళ్లు మంజూరైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రగతి శూన్యంగా కనిపిస్తోంది. లక్ష్యానికి, క్షేత్రస్థాయిలో పూర్తయిన ఇళ్లకు అస్సలు పొంతన లేకుండా పోయింది.

కాగితాలకే పరిమితమైన లక్ష్యాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 36,501 ఇండ్లు మంజూరు చేయగా.. అందులో ఇప్పటివరకు కేవలం 2,555 ఇండ్లు మాత్రమే విజయవంతంగా పూర్తయ్యాయి. అంటే మంజూరైన వాటిలో కనీసం 10 శాతం ఇండ్లు సైతం పూర్తి కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా 33 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు తీవ్ర జాప్యంతో అటకెక్కాయి. పూర్తయిన ఆ కాస్త ఇళ్లలో కూడా దాదాపు సగం మంది మాత్రమే గృహప్రవేశాలు చేసుకోగా, మిగిలిన వారు ఇంకా మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నారు. నల్లగొండ జిల్లాలో 829 ఇండ్లు మాత్రమే పూర్తికాగా, సూర్యాపేట జిల్లాలో 462 ఇండ్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 1264 ఇండ్లు మాత్రమే పూర్తియ్యాయి. ఇంకా 33,946 ఇండ్లు నిర్మాణం కావాల్సి ఉంది. యాదాద్రిలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, సూర్యాపేట జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ కేవలం 462 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>