కలం, వెబ్ డెస్క్ : జైపూర్‌లో జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జయంట్స్ (RR vs LSG) మ్యాచ్‌లో లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ అదరగొట్టారు. మార్ష్ అయితే వన్‌మ్యాన్ షో కనబరిచాడు. రాజస్థాన్ బౌలర్లు ఎవరు బౌలింగ్ వేస్తున్నా తన టార్గెట్ బౌండ్రీనే అన్నట్లు ఊచకోత కోశాడు. అతనికి అద్భుతమైన పార్ట్‌నర్ షిప్‌ను ఇంగ్లీస్ అందించాడు. కానీ 60 పరుగుల దగ్గర ఇంగ్లిస్ పెవిలియన్ చేరినా మార్ష్ మాత్రం తన దూకుడు ఏమాత్రం తగ్గించుకోలేదు. దీంతో లక్నో సూపర్ జయంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. రాజస్థాన్ పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఇద్దరూ బౌండరీల వేట సాగించారు. ముఖ్యంగా ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే గేర్ మార్చేశాడు. కేవలం 29 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 206.89 స్ట్రైక్ రేట్‌తో 60 పరుగులు చేసి రాజస్థాన్ బౌలింగ్ విభాగాన్ని ఆత్మరక్షణలో పడేశాడు. ఈ జోడి తొలి వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 109 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించి లక్నోకు సాలిడ్ ఫౌండేషన్ వేసింది.
తొలి వికెట్ పడ్డాక మిచేల్ మార్ష్ వన్‌మ్యాన్ షోతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒకవైపు నికోలస్ పూరన్ (16) త్వరగానే అవుట్ అయినా.. మార్ష్ మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కెప్టెన్ రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. రాజస్థాన్ బౌలర్ల లెంగ్త్‌లను ముందే పసిగడుతూ మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు. శతకం ఖాయమనుకున్న తరుణంలో, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో యశస్వి జైస్వాల్ విసిరిన మెరుపు త్రోకు మార్ష్ (96 పరుగులు, 57 బంతుల్లో, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రనౌట్ అయ్యాడు. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నా, లక్నోకు కొండంత స్కోరునైతే అందించాడు. ఆఖర్లో కెప్టెన్ పంత్ 23 బంతుల్లో 35 పరుగులు చేసి రనౌట్ అవ్వగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు బోర్డుపై పెట్టింది.

