కలం, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సమావేశంలో భక్తుల సంక్షేమం, పారదర్శక పాలన, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతల ప్రివిలేజెస్‌లో పారదర్శకత, ఏకరీతిని తీసుకువస్తూ నాలుగు కొత్త కేటగిరీలను ప్రవేశపెట్టారు. ఈ సరికొత్త విధానం జూలై 15 అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుంది. అయితే ఇప్పటికే విరాళాలు అందించిన పాత దాతలకు ప్రస్తుతం ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
కొత్త విధానం ప్రకారం, రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు విరాళం ఇచ్చే దాతలకు వార్షిక బహుమతిగా 5 నుండి 10 చిన్న లడ్డూలు, సిల్క్ దుపట్టా, బ్లౌజ్ పీస్ అందిస్తారు. అలాగే రూ.10 లక్షల నుండి రూ.25 లక్షల వరకు అందించే వారికి 15 చిన్న లడ్డూలతో పాటు సిల్క్ దుపట్టా, బ్లౌజ్ పీస్ లభిస్తాయి. ఇక భారీ విరాళాలు ఇచ్చే దాతల కోసం మరిన్ని ప్రత్యేక బహుమతులను ప్రకటించారు. రూ.50 లక్షల నుండి రూ.75 లక్షల వరకు విరాళం ఇచ్చే వారికి ఏటా 15 నుండి 20 చిన్న లడ్డూలు, 5 నుండి 7 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలతో పాటు ఒకేసారి మాత్రమే అందించే (వన్ టైం గిఫ్ట్) 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణెం బహుకరిస్తారు. రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే అత్యున్నత కేటగిరీ దాతలకు ఏటా 20 నుండి 30 చిన్న లడ్డూలు, 10 నుంచి 20 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు లభిస్తాయి. వీటితో పాటు వన్ టైం గిఫ్ట్‌గా 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణేన్ని టీటీడీ బహూకరించనుంది.
దాతల నిబంధనలతో పాటు సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) బోర్డు మరికొన్ని కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తిరుమలలో ఎస్ఎస్‌డీ (SSD) భక్తుల కోసం శాశ్వత షెడ్లు, క్యూలైన్లు, మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో రూ. 17.84 కోట్లతో 100 గదుల భారీ యాత్రికుల విశ్రాంతి గృహాన్ని నిర్మించనున్నారు. వేద సంరక్షణలో భాగంగా వేద పారాయణ స్కీం ద్వారా 791 మంది సంభావన వేద పండితులను నియమించబోతున్నారు. వీటితో పాటు గ్రీన్ ఎనర్జీ, భక్తుల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడం, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణతో టీటీడీని ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దడమే తమ నిరంతర కర్తవ్యమని బోర్డు వెల్లడించింది.

