కలం, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం (TTD Board) సమావేశంలో దాతలకు అందిస్తున్న సౌకర్యాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు దాతలకు దర్శనాలు, వసతికి సంబంధించి అందుతున్న సౌకర్యాల్లో కోత విధించనున్నారు. మంగళవారం జరిగిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. సమావేశంలో 72 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అళ్వార్ ట్యాంక్ సమీపంలో భక్తులకు శాశ్వత వసతి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కుమారధార, పసుపుధార పుణ్య తీర్థాల అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు రచించనున్నారు. దీని కోసం డబుల్ లైన్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. శ్రీవేంకటేశ్వర మ్యూజియంకు సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. మ్యూజియం నిర్వహణను టాటా సంస్థకు ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో అదనపు సదుపాయాల కల్పనకు రూ.2.98 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.
దాతలకు కోత
టీటీడీ దాతలకు అందిస్తున్న సౌకర్యాలకు కోత పెడుతూ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి ఇప్పటి వరకు 1.9 లక్షల మంది దాతలున్నారు. వీరికి ఆలయంలో పలు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. వీటిని తగ్గిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న దాతలకు ఈ కోతలు వర్తించవు. కొత్త దాతలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు.
ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి 1000 గ్రాముల బంగారాన్ని అందించనున్నారు. ఆలయంలో యాత్రికుల కోసం వంద పడకల విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్నారు. అలాగే తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2.5 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న కాటేజీలను తొలగించనున్నట్లు వెల్లడించారు. వాటి స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో భవనాలను నిర్మించనున్నారు.
సౌకర్యాల కల్పనలో సామాన్యులకే పెద్దపీట వేయనున్నారు. సామాన్యులకే స్వామి వారి దర్శనం ఎక్కువ సేపు అందించనున్నారు. టీటీడీ తొలి హారతిపై కర్ణాటక నేతలతో చెలరేగిన వివాదంపై పాలక మండలి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీ విధివిధానాల గురించి కర్ణాటక సీఎంతో చర్చిస్తామని చెప్పారు.

