కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో నిర్వహించిన ప్రజా సర్వే వివరాలను ఆయన వెల్లడించారు.
తెలంగాణతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి నిత్యం వేలాది మంది పేద రోగులు ఇక్కడికి వస్తున్నారని, ప్రస్తుతమున్న 575 పడకలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఆధునీకరించి సూపర్ స్పెషాలిటీగా మార్చేందుకు ప్రభుత్వం వెంటనే రూ. 300 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఎదురవుతున్న సమస్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతి కాకుండా రెగ్యులర్ సూపర్ స్పెషలిస్ట్ వైద్యులను, ముఖ్యంగా గైనకాలజిస్ట్‌లను, కార్డియాలజిస్ట్‌లను నియమించాలని నున్నా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రూ. 6 కోట్లతో మంజూరైన ఎమ్మారై (MRI) మిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, మూలనపడ్డ స్కానింగ్ సేవలను వెంటనే పునరుద్ధరించి పేదలకు ప్రైవేట్ ఖర్చులను తప్పించాలన్నారు.
ఓపీ కౌంటర్లు, మందుల కౌంటర్ల సంఖ్యను పెంచాలని, ఎక్స్-రే రక్త పరీక్షల రిపోర్టుల జాప్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి సమ్మెల సమస్యను పరిష్కరించాలని, రోగులందరికీ నాణ్యమైన భోజనంతో పాటు ఉచిత మందులు ఆసుపత్రిలోనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధులు వై. విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

