కలం, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలపై ముందుకు వెళ్తూ, ముందంజలో ఉన్న పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను వాయిదా వేయడం పట్ల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు సందర్భాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి పెద్దపల్లి విమానాశ్రయాన్ని అత్యవసరంగా ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. ఉడాన్ (UDAN) పథకం కింద పెద్దపల్లికి విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన హామీ లేదా సానుకూల నిర్ణయం రాలేదని పేర్కొన్నారు.
పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు, పారిశ్రామిక మరియు వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి గణనీయమైన ప్రయాణికుల డిమాండ్‌తో పాటు ఆదాయ అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను పక్కన పెట్టడం అన్యాయమని విమర్శించారు.
పెద్దపల్లి ప్రజల న్యాయమైన హక్కు కోసం పార్లమెంట్లో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించి, అవసరమైతే ఉద్యమం చేపట్టి విమానాశ్రయాన్ని సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.పెద్దపల్లి ప్రజల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల విస్తరణ కోసం విమానాశ్రయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెద్దపల్లి విమానాశ్రయానికి తక్షణమే ఆమోదం ఇవ్వాలని ఆయన కోరారు.

