వైకుంఠ ద్వార దర్శనాలు.. భక్తులకు టీటీడీ తీపికబురు

కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను (Vaikunta Dwara Darshanam) నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పది రోజులలో మొదటి రెండు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు కేటాయించనుండగా, మిగిలిన 8 రోజులు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. గత ఏడాది 7.45 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించగా, ఈసారి అదనంగా మరో 51 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్

భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుపతిలో రూ.2,750 కోట్ల భారీ వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. దీనితో పాటు తిరుమల మెట్ల మార్గం అభివృద్ధి పనులకు, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. శ్రీవారి ఆలయ నెయ్యి అవసరాలను తీర్చేందుకు రూ.7.7 కోట్లతో 500 ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే వన్యప్రాణుల సంరక్షణకు రూ.16.4 కోట్లు, స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.41.2 కోట్ల గ్రాంటు, శిల్ప కళాశాల హాస్టళ్ల నిర్మాణానికి రూ.23 కోట్లు కేటాయించారు.

ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల కానుక..

టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి కూడా బోర్డు పెద్దపీట వేసింది. బ్రహ్మోత్సవాల కానుకగా రెగ్యులర్ ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇందులో సగం మొత్తాన్ని చెల్లించనున్నారు. ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధి కోసం రూ.230 కోట్లతో పాటు ఉద్యోగుల వాటాగా రూ.80 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు వేద పారాయణదారుల వేతనాల పెంపునకు కూడా టీటీడీ పాలకమండలి ఆమోదముద్ర వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>