కలం, నల్లగొండ : ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాకుండానే, ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో మే నెల వేతనాల్లో 1.5 శాతం కోత విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నల్లగొండ (Nalgonda) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాసా చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రులతో ఒప్పందాలు, ప్యాకేజీ రేట్ల నిర్ణయం, డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీ లాంటి ప్రాథమిక ప్రక్రియలేవీ పూర్తి కాలేదని, కనీసం చందా మినహాయింపుపై జీవో కూడా ఇవ్వకుండా జీతాల్లో కోత పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు.
విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ చూసుకుంటుందని చెప్పే ఆర్థిక శాఖ అధికారులు, అవి లేకుండానే ఏకపక్షంగా, నియంతృత్వంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవడమే కాకుండా, ప్రభుత్వానికి-ఉద్యోగులకు మధ్య దూరం పెరుగుతుందని హెచ్చరించారు. “ఐఎఫ్‌ఎంఐఎస్ సైట్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్రియ నిన్నటి వరకు మారుస్తూనే ఉన్నారన్నారు. ఆధారిత కుటుంబ సభ్యులపై ఇంకా స్పష్టత రాలేదని, జీవో 174 ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒక్కరి నుంచే చందా మినహాయించాల్సి ఉండగా, ఇప్పుడు ఇద్దరి జీతాల నుండి కట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 31న రిటైర్ అయ్యే వారి నుంచి కూడా 1.5% కోత విధించడం విడ్డూరమన్నారు. నిజానికి ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పటికీ, కార్పొరేట్ వైద్య ఖర్చుల దృష్ట్యా కొంత భారం పంచుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయని గుర్తుచేశారు. అయితే, ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాల్సింది పోయి, ఇంత హడావుడిగా కోతలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్న ఈ వేతనాల కోతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి (ఆర్థిక మంత్రి) వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ కోరింది.

