కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy), ఒక ఆటో డ్రైవర్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డిలో ఆటో కార్మికులతో ముచ్చటించిన జగ్గారెడ్డి, ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల తరఫున ఏం చెప్పాలని వారిని అడిగారు. దీనికి ఒక ఆటో డ్రైవర్ స్పందిస్తూ ఆటో చార్జీలు పెంచాలని కోరాడు. అయితే ఆటో చార్జీలు పెంచితే తమను ప్రజలు తిడతారని జగ్గారెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే మోదీని ప్రజలు ఎలా తిడుతున్నారో, ఆటో చార్జీలు పెంచితే తమ ప్రభుత్వాన్ని , తమను కూడా అలాగే తిడతారన్నారు. ఇక ఆటో డ్రైవర్లు స్పందిస్తూ కనీసం ఎన్నికల హామీ ప్రకారం తమకు ఇస్తామన్న రూ.10 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడం వల్లే నిధుల ఇబ్బంది తలెత్తిందని, లేదంటే ఆ మొత్తాన్ని ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సమస్యేమీ కాదని వివరించారు. ఖజానా నిండగానే ఆటో కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, వారి సమస్యలను స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

