కలం, భువనగిరి: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక సౌకర్యాలను అందించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కొనియాడారు. బుధవారం భువనగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో ఐఓసీఎల్, నిర్మాణ్ సంస్థల ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్‌తో పాటు పలు మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.3.65 కోట్ల వ్యయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో ఐ-స్పార్క్ ల్యాబ్‌లు, బంకర్ బెడ్స్, సోలార్ ఫెన్సింగ్, మెష్ డోర్లు, కిటికీలు వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించడం సంతోషకరమన్నారు. ఇవి విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందిస్తాయని చెప్పారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నిర్మాణ్ సంస్థలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొంటూ, సంస్థల ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ ప్రతినిధులు ఎలిమరన్, కైలాష్ కాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కలిసి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు అనురాధ, నీరజ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేష్ చిస్తీ, సెక్టోరియల్ అధికారులు సీహెచ్ రాధ, పెసరు లింగారెడ్డి, మండల విద్యాధికారి సీహెచ్ రంగరాజన్, ఇతర అధికారులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

