కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం (Ramavaram) మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణీ(Pregnant Woman) తీవ్రమైన నరకయాతన అనుభవించింది. పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సదరు మహిళ పట్ల అక్కడ విధులలో ఉన్న సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీవ్రమైన ప్రసవ వేదనతో ఆమె విలవిలలాడుతున్నా సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించే వారు కరువయ్యారు. సిబ్బంది నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో నొప్పులు భరించలేక ఆ గర్భిణీ తీవ్ర ప్రసవ వేదనతో బెడ్డు పక్కనే నిల్చుండిపోయింది.
ఆ సమయంలో నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఆమె నిల్చున్న స్థితిలోనే ప్రసవించింది. ఈ క్రమంలో నవజాత శిశువు ఒక్కసారిగా కింద పడిపోగా, ఆ బాలింతకు తీవ్ర రక్తస్రావమైంది. కళ్ల ముందే జరిగిన ఈ దారుణాన్ని చూసి పక్క బెడ్లపై ఉన్న తోటి గర్భిణీలు, బాలింతలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ, బిడ్డల ప్రాణాలతో ఆడుకున్న బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

