కలం, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ జట్టులో (Mumbai Indians) భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే వారం ఇంగ్లండ్‌లో జరిగే కీలక సమావేశంలో ఫ్రాంచైజీ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కెప్టెన్సీ నుంచి కోచ్ వరకు, ఆటగాళ్ల ట్రేడ్స్ వరకు అన్ని అంశాలపై చర్చ జరగనుంది. గత రెండు సీజన్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే భవిష్యత్తు కూడా చర్చకు రానుంది. 2025లో జట్టు నాలుగో స్థానంలో నిలిచినా, 2026లో తొమ్మిదో స్థానంతో నిరాశపరిచింది.
హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సమావేశం తర్వాత దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హార్దిక్ మాత్రమే కాదు, మరో మాజీ భారత కెప్టెన్ పేరు కూడా ట్రేడ్ చర్చల్లో వినిపిస్తున్నట్లు సమాచారం. 2027 సీజన్‌కు కెప్టెన్ ఎవరు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జస్ప్రీత్ బుమ్రాపై యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు సీజన్లలో ఆయన జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. భారత్‌కు టెస్టుల్లో కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.
మరోవైపు యువ ఆటగాడు తిలక్ వర్మ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే బ్యాటింగ్‌లో ఇంకా నిలకడ సాధించాల్సి ఉందని, ఈ దశలో కెప్టెన్సీ అదనపు ఒత్తిడిగా మారొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కొత్త దిశగా అడుగులు వేస్తుందా? లేక పాత కోర్‌పైనే నమ్మకం ఉంచుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వారం జరిగే సమావేశం తర్వాత వచ్చే అవకాశం ఉంది.

