కలం, సూర్యాపేట: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ (ACB) మరోసారి ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా ఇవ్వాల్సిన అనుమతుల కోసం ప్రజలను ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తున్న సూర్యాపేట (Suryapet) జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి బాలు బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ఆయనతో పాటు కార్యాలయంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి (డేటా ఎంట్రీ ఆపరేటర్) వెంకటేశ్వర్లు కూడా ఏసీబీ వలలో చిక్కారు.
ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం… ఒక బోర్వెల్ రిగ్ యజమాని సుమారు ఆరు నెలల క్రితం బోర్వెల్ డ్రిల్లింగ్ మిషన్ను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. అయితే జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీస్ నుంచి అనుమతి తీసుకోవాలనే విషయం తెలియకపోవడంతో, గ్రామానికి సమీపంలో బోరు వేస్తున్న సమయంలో కార్యాలయ సిబ్బంది వచ్చి సదరు యజమానిని జిల్లా అధికారి వద్దకు పంపారు. బాధితుడు కార్యాలయానికి రాగా, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి బాలు బెదిరింపులకు దిగారు. అనుమతి లేకుండా బోరు వేస్తున్నందుకు చలాన్ కింద రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలు అవుతుందని భయపెట్టారు.
ఆ జరిమానా నుండి తప్పించుకోవాలంటే కార్యాలయ ఆవరణలో ఉచితంగా బోరు వేసి ఇవ్వాలని లేదా రూ.20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారి అడిగినట్లు ఉచితంగా బోరు వేయడం కానీ, లక్షల్లో డబ్బులు చెల్లించడం కానీ ఇష్టం లేని బాధితుడు ఈ నెల 10వ తేదీన నల్గొండ ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు, బుధవారం జిల్లా కార్యాలయంలో పక్కా వ్యూహంతో నిఘా పెట్టారు.
అధికారి బాలు సూచనల మేరకు బాధితుడి నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు రూ.20,000 నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. అధికారి బాలును కస్టడీలోకి తీసుకున్న అనంతరం, ఏసీబీ బృందాలు సూర్యాపేటలోని ఆయన నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.
ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ విధులు నిర్వర్తించడానికి లంచాలు డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీని సంప్రదించాలని కోరారు. బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

