కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఇరాన్ , అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల మధ్య కీలక శాంతి చర్చలు ప్రారంభం అయిన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి మూసివేత ద్వారా ప్రపంచ దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయని అన్నారు. అయితే అమెరికా వద్ద అత్యధికంగా చమురు ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన రష్యా, సౌదీ అరేబియా దేశాల కంటే తమ వద్దే నాణ్యమైన చమురు ఉందని స్పష్టం చేశారు.
చమురు సరఫరాపై దిగులు చెందొద్దని ప్రపంచ దేశాలకు ట్రంప్ పిలునిచ్చారు. అంతేకాదు చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రతరంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ వైఫల్యం కారణంగా ఇప్పటికే చర్చలు ఐదు గంటలు ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఇరు దేశాల ప్రతినిధులతో శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పశ్చియాసియాలో మరోసారి ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

