Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు దిగొచ్చేనా!

కలం, వెబ్ డెస్క్: హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌తో జరుగుతున్న దౌత్య చర్చల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పోస్టు చేశారు. పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాల అభ్యర్థన మేరకు.. అలాగే, ఇరాన్‌పై సాధించిన దౌత్యపరమైన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ఆపుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రతినిధులతో ఒక సమగ్రమైన, తుది ఒప్పందం కుదుర్చుకునే దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్‌ ఓడరేవులపై విధిస్తున్న దిగ్బంధనం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

లొంగిపోవాల్సిందే..

ఓవల్‌ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ బయటకి ఎన్ని ప్రకటనలు చేసినా.. లోలోపల మాత్రం అమెరికాతో ఒప్పందం కోసం రహస్యంగా ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు. ‘‘ఇరాన్‌ లొంగిపోవాలి.. ఒకవేళ మేము పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగితే, దాన్ని ఆపడం వారి తరం కాదు’’ అని ట్రంప్‌ హెచ్చరించారు.

ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్ నేపథ్యం

అమెరికా-ఇజ్రాయెల్‌–ఇరాన్‌ల మధ్య సాగుతున్న ఘర్షణల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న నౌకలను మానవతా దృక్పథంతో సురక్షితంగా బయటకు చేర్చడమే లక్ష్యంగా ట్రంప్‌ ఈ ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను ప్రకటించారు. అయితే, ప్రాజెక్టు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దౌత్యపరమైన కారణాలతో దీన్ని నిలిపివేయడం గమనార్హం. ఒప్పందంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.

క్రూడాయిల్ ధరలు పతనం

మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు వీడి.. శాంతి నెలకొంటుందన్న వార్తలు ప్రపంచ మార్కెట్‌కు ఊపిరిపోశాయి. అమెరికా, ఇరాన్ మధ్య సమగ్ర ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బుధవారం సుమారు 9 శాతం పైగా క్షీణించి 101 డాలర్ల వద్దకు చేరింది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేయడం.. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల్లో గొప్ప పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం.. ఈ ధరల పతనానికి ప్రధాన కారణమైంది. పోయిన వారం 126 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధర.. ఇప్పుడు వంద డాలర్లకు పడిపోవడం వినియోగదారులకు పెద్ద ఊరట. ముడి చమురు ధర తగ్గడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ షార్టేజ్ ఏర్పడుతుందన్న ఆందోళనలు తొలగిపోయాయి. గ్యాస్ సరఫరాలో ఆటంకాలు తొలగే అవకాశాలున్నాయి. వెరసి రవాణా ఖర్చులు తగ్గడంతో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>