సింగరేణి అధికారుల ఆందోళనకు కవిత సంఘీభావం

కలం, ఖమ్మం బ్యూరో : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో (Manuguru) ఆందోళన బాట పట్టిన సింగరేణి అధికారులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం అటు కార్మికులు, ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పే రివిజన్, పీఆర్పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే)లను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

ప్రతి సందర్భంలోనూ తమకు రావాల్సిన పే రివిజన్, పీఆర్పీ బకాయిల కోసం అధికారులు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. సంస్థలోని రెగ్యులర్ వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం లేకుండా ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకురావాలని, అప్పుడు మాత్రమే సింగరేణి (Singareni) సంస్థ మనుగడ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి అటు కార్మికులకు, ఇటు అధికారులకు మంచి జరిగేలా సానుకూల చర్యలు తీసుకోవాలని కోరారు.

​గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో సింగరేణి అధికారులు ముందుండి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని కవిత (Kavitha) ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఆఫీసర్లు తమ సమస్యల పరిష్కారం కోసం మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ‘తెలంగాణ వచ్చాక కూడా ఇంకా రోడ్లపైకి వస్తున్నారేంట్రా?’ అని ఓ యువ అధికారిని వాళ్ల అమ్మ అడిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అధికారుల సమస్యలపై తమ హెచ్‌ఎంఎస్ నేత రియాజ్ ముందే స్పందించి అధికారులకు మద్దతు తెలిపారని, వారి డిమాండ్ల సాధన విషయంలో తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి పే రివిజన్, పీఆర్పీతో పాటు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Read Also: నాకు తెలంగాణ ఫస్ట్​.. తరువాతే పార్టీ : ఈటల కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>