Mobile Popup Ad
Mobile Popup Ad

నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల (మే) 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు నెల రోజులపాటు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలన్నారు. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని కవిత (TRS Chief Kavitha) సూచించారు.

తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచినా తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు – నిధులు – నియామకాలను సాకారం చేసుకోవడంలోనూ వంచనకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.

వలస పాలన నాటి దుష్పరిణామాలను ఇప్పుడు మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోందని కవిత అసహనం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని పార్టీ శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు.

అందుకే టీఆర్ఎస్ జెండా ను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున చేరిన నాయకత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని కవిత కోరారు.

జెండా పండుగతో పాటు రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేసి వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కవిత వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి తీసుకు రావాలని, ఇందుకు సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలని కవిత సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>